- సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకునేందుకు చాన్స్
- వరుస సెలవుల నేపథ్యంలో మరో రోజు పొడిగింపు
- ఇప్పటివరకు అందిన దరఖాస్తులు 5.78 లక్షలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘చేయూత’ కొత్త పింఛన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5.78 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఈనెల 25 నాటికి చేయూత దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగవద్దని స్పష్టం చేశారు. పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలని, ఎంపీడీవోలు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఇంటింటికీ వెళ్లి విచారణ..
అధికారులు నేరుగా దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి 12 రకాల అంశాలపై ఆరా తీసి, యాప్‌లో వివరాలు నమోదు చేయాలని సెర్ప్ సీఈవో స్పష్టం చేశారు. దివ్యాంగుల పింఛన్ల దరఖాస్తుల్లో ఎవరైనా నకిలీ సదరం సర్టిఫికెట్లు పెట్టినట్లు తేలితే జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. చేనేత, గీత కార్మికుల దరఖాస్తులను తనిఖీ కోసం సంబంధిత శాఖలకు పంపిస్తున్నట్లు వెల్లడించారు.
